సాగదీత కుదరదు!

మరణశిక్షపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉరిశిక్ష ప్రక్రియకు ముగింపు తీసుకురావడం అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించింది. మరణ దండన అమలుకు నిర్దిష్ట అవధి లేదని, తాము ప్రతిసారీ సవాల్ చేయొచ్చని దోషులు భావించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. నిర్భయపై సామూహిక లైంగికదాడి, హత్య కేసులో నలుగురు దోషులు తమకు పడిన ఉరిశిక్షను జాప్యం చేసేందుకు ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు దాఖలుచేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాము చట్టం ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందని, సమాజానికి, బాధితులకు న్యాయం అందించాల్సిన బాధ్యత తమపై ఉన్నదని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఏడుగురు కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో ఉరిశిక్ష పడిన ఒక మహిళ, ఆమె ప్రియుడు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై గురువారం విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రతిదానికీ అంతులేని పోరాటం తగదని పేర్కొంది. ఈ కేసులో రివ్యూ పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ప్రియుడితో కలిసి ఆ మహిళ తన తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు, వారి భార్యలు, 10 నెలల మేనల్లుడిని దారుణంగా హతమార్చింది. దీనిపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. అలహాబాద్ హైకోర్టు కూడా 2010లో ఆ శిక్షను సమర్థించింది. అనంతరం నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, 2015లో అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది.