కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. దేశంలోనూ లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో సాధారణ ప్రజల కష్టాలను పక్కన పెడితే.. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. పశ్చిమబెంగాల్లో అయితే రోగుల దుస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడి బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిలువలు నిండుకోవడంతో రోగులకు సకాలంలో సర్జరీలు చేసే అవకాశాలు కూడా లేకుండా పోయాయి.
సాధారణ రోజుల్లో అయితే రాజకీయ పార్టీలు, సామాజిక సేవా సంస్థలు, స్వచ్ఛంధ సంస్థలు క్యాంపులు నిర్వహించి రక్త దానాలు చేయించేవి. దీంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిలువలు సరిపడా ఉండేవి. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో బ్లడ్ బ్యాంకులకు కొత్తగా రక్తం వచ్చే పరిస్థితులు లేవు. దీనికి తోడు ఉన్న రక్తం నిలువులు కూడా దగ్గరపడ్డాయి. దీంతో నిత్యం రక్తమార్పడి అవసరమయ్యే క్యాన్సర్, థలసేమియా రోగులు, మేజర్ సర్జరీలు అవసరమైన వారు బెంగాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిలువలు నిండుకోవడంతో ఎప్పుడూ రక్తమార్పిడి అసరమయ్యేవారి పరిస్థితి దయనీయంగా మారిందని బెంగాల్లోని బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు అంటున్నారు. సాధారణంగా అయితే వేసవి రోజుల్లో బ్లడ్ డోనేషన్ క్యాంపులు ఎక్కువగా నిర్వహించేవారని, వేరే సీజన్లతో పోల్చితే వేసవి సీజన్లో 40 శాతం ఎక్కువగా బ్లడ్ బ్యాంకులకు రక్తం చేరేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా రక్తదాన క్యాంపులు నిర్వహించే పరిస్థితిలేకపోవడంతో రక్తం నిలువలు వేగంగా తగ్గిపోయాయని తెలిపారు.