మళ్లీ భారత జట్టులోకి వస్తా: దినేశ్ కార్తీక్

టీమ్​ఇండియాలో మళ్లీ చోటు దక్కించుకుంటానని వికెట్ కీపర్ బ్యాట్స్​మన్ దినేశ్ కార్తీక్ విశ్వాసం వ్యక్తం చేశాడు. తన ప్రతిభ మీద తనకు ఎలాంటి అనుమానం లేదని బుధవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. గతేడాది 2019 ప్రపంచకప్ తర్వాత భారత వన్డే జట్టులో కార్తీక్ చోటు కోల్పోయాడు.


‘టీ20ల్లో నా రికార్డు చాలా బాగుంది. మేం ప్రణాళిక వేసుకున్న విధంగా వన్డే ప్రపంచకప్​లో ఫలితం రాలేదు. నన్ను వన్డే జట్టును ఎందుకు తప్పించారో అర్థం చేసుకోగలను. అయితే, టీ20ల్లో మాత్రం నాకు మళ్లీ చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నా. ఇటీవల దేశవాళీ క్రికెట్​లోనూ బాగా ఆడా. నా మీద నేను అనుమానపడాల్సిన అవసరం లేదు(భారత జట్టులో పునరాగమనంపై)’ అని కార్తీక్ చెప్పాడు.


అలాగే ఐపీఎల్​లో రాణిస్తే టీ20 ప్రపంచకప్​లోనూ చోటు దక్కేందుకు అవకాశముంటుందని తనకు తెలుసునని కోల్​కతా నైట్​రైడర్స్ కెప్టెన్​గా ఉన్న దినేశ్ కార్తీక్ తెలిపాడు. లాక్​డౌన్ ముందు ఐపీఎల్ కోసం ఎంతో ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. కరోనా వైరస్​ను ప్రపంచం జయిస్తుందని దినేశ్ కార్తీక్​ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు తన 15ఏండ్ల కెరీర్​లో కార్తీక్ టీమ్​ఇండియా తరఫున 26టెస్టులు, 94వన్డేలు, 32 టీ20లు ఆడాడు.